పురోహితం అంటే ఏమటి?

updated: March 11, 2018 22:36 IST

పౌరులుండేది పురం. అటువంటి పురం యొక్క హితం కోరేవాడు పురోహితుడు. పురోహితాన్ని మంత్రోచ్చారణతో నిర్వహించటం "పౌరోహిత్యం" .  హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం.. మనము ఏదైన పనిచేయబోయినప్పుడు, ముందుగా, పురోహితుడుని సంప్రదిస్తే, ఆ పని చేయడం లోని మంచి, చెడ్డలను చెప్పి, ఆ పని చేయడం యోగ్యమయిన దయితే, దానిని నిర్వర్తించే విధానం తెలిపేవాడు పురోహితుడు. 

అందువలన, ఒకపనిని, స్వప్రయోజనాన్ని ఆశించిగాని, లేదా ఇతర కారణముల వలన గాని మన చేత చేయిస్తే, దాని వలన వచ్చే పాపము పురోహితునికే వెడుతుందిగాని, మనకు కాదు అని చెప్పబడినది.  అందువలన, ఏ పనిచేయడానికైనా ముందు పురోహితుని అనుజ్ఞ తీసుకోవాలి.  అలాగే రాజా రాష్ట్రకృతం పాపం రాజ పాపం పురోహితః పాలకుడైన వాడు పాలితుల ( ప్రజల ) పాపములకు బాధ్యుడు, పాలకుని పాపములకు పురోహితుడు బాధ్యుడు అని కూడా పురాణాల్లో చెప్పబడినది. 

 ఇక పూర్వకాలంలో, రాజ్యానికి శుభములు సమకూడేందుకు, పరరాజుల దండయాత్రల వంటి విషమ పరిస్థితులలోను మంత్రి, పురోహితులతో రాజు సమాలోచనలు జరిపేవాడు. వివాహాది షోడశకర్మలు, పూజలు, వ్రతాలు మరియు యజ్ఞయాగాదులు, జరుపడానికి సామన్యప్రజలు పురోహితుడునీ తప్పక ఆశ్రయించేవారు.

ఇప్పటికీ ప్రతీ పల్లెలోనూ, గ్రామంలోనూ, సిటీల్లోనూ పురోహితులు కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికి తిరుమల తిరుపతి, మహర్షి మహేష్ యోగి వేద పీఠం వంటి సంస్దలు పురోహితులను తయారు చేసేందుకు నడుం బిగించి స్మార్త పాఠాలు ను నేర్పుతున్నాయి. 

comments